తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి రోడ్లు శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, 40 లక్షలతో ఏర్పాటు చేసిన గాంధీ పార్క్ ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న ఆహారం కోడిగుడ్లు మంత్రి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ…గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. నేడు ఈ ఏడాదికి రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నాం. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రానికి
పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గులేకుండా వెన్నుపోటు అంటూ ఆ పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారు. గత ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీనే, అందుకే ఆ పార్టీని ప్రజలు 11 కు పరిమితం చేశారు. వైసీపీ నేతలు మహిళలపై కూడా దిగజారి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
