google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ, గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న అర్రిబోయిన రాంబాబు సంకలనం చేసిన “మన భారతీయ నైతిక విలువలు” పుస్తకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వ వికాసం ప్రాథమిక స్థాయి నుంచే పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు రామాయణం, మహాభారతం, భాగవతం వంటి భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని స్ఫూర్తిదాయకమైన కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. ప్రభుత్వం కూడా ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు,గరికపాటి నరసింహారావు వంటి వారి ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక నైతిక విలువల తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తోందని తెలుపుతూ రాంబాబును అభినందించారు.
పుస్తక రచయిత అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు డోలా సువర్ణ పద్మావతి గారి మార్గదర్శకత్వంలో భారతీయ ఇతిహాసాల్లోని నైతిక విలువలను ఆధారంగా చేసుకుని 20 కథలతో ఈ పుస్తకాన్ని రూపొందించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారుల్లో చిన్న వయస్సు నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ అలవడేలా రంగురంగుల చిత్రాలతో కూడిన కథలను పుస్తకంలో పొందుపరిచామని తెలిపారు. ఈ పుస్తకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం తన జీవితంలో ఒక చిరస్మరణీయ ఘట్టమని, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, ప్రసాద్, రాంబాబు, జనసేన నాయకులు ఐనాబత్తిన రాజేశ్, సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *