ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్ స్టాండ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతున్నాయి.ఈ తనిఖీల్లో పోలీసులు ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, ప్రవేశ ద్వారాలు, నిరీక్షణ మందిరాలు, ప్లాట్‌ఫారాలు, బస్ బేలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను పరిశీలించడంతో పాటు, అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు మరియు సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ప్రయాణికుల భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండేందుకు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు మరియు ఇతర భద్రతా విభాగాలతో సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. అలాగే మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాల అక్రమ తరలింపు, చోరీలు, జేబుదొంగతనాలు, మహిళలపై వేధింపులు వంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు పలు భద్రతా సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఆహారం, పానీయాలు స్వీకరించవద్దని, తమ సామానును నిర్లక్ష్యంగా వదిలివేయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్–112కు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని కల్పించేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *