తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావాలు మరియు ముందస్తు సన్నద్ధత చర్యలపై సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, పైప్‌లైన్లలో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి వృథాను నివారిస్తూ, నీటి పంపిణీ సమయాలను ముందుగానే ప్రజలకు తెలియజేసి నిర్ణీత సమయాల్లోనే సరఫరా చేయాలని సూచించారు.రేపటి నుంచి స్వర్ణ గ్రామం స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు నీటి వినియోగం అధికంగా ఉండే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.పశుసంవర్థక శాఖ అధికారులు పశుసంపద సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, పశువులకు అవసరమైన పచ్చిగడ్డి అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.మండలంలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేసి ఎల్‌నినో ప్రభావాలను తగ్గించే చర్యలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎంపీడీవో సూచించారు.ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి , పశుసంవర్థక శాఖ వైద్యులు, ఏఈ -ఆర్‌డబ్ల్యూఎస్, ఏఈ- ఇరిగేషన్, ఏఈ -ఎలక్ట్రికల్, డిప్యూటీ ఎంపీడీవో, ఏఈ -హౌసింగ్, ఏపీఓ, ఏపీఎం, ఫిషరీస్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, మండల పరిషత్ ఏఓ తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.