భక్తులకు అమ్మవారి ప్రతిమలు, గాజులు, తీర్థప్రసాదాలు.. అనంతరం అన్నసంతర్పణ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవం శుక్రవారం ఉదయం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు, విశేష మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రతిమలు, గాజులు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.శ్రావణ మాసంలోని శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనవని, ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు అత్యంత నిష్ఠతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలిపారు. ఈ వ్రతంతో సకల ఐశ్వర్యాలు, కుటుంబ సుఖసంతోషాలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కార్యనిర్వహణాధికారి వి. రంగరాజు, ముఖ్య అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నరసింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీ నరసింహాచార్యులు, ఉదయగిరి యోగానంద, కమిటీ సభ్యులు పెద్దిశెట్టి ప్రమీల, అంబటి కోటేశ్వరమ్మ, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
