ఇంటింటికి ఆయుర్వేదం ప్రభుత్వ లక్ష్యం
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం ఆయుర్వేదంతో సాధ్యం
— ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. భ్రమరాంబ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలోని బి.ఎం.ఆర్. కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఆయుర్వేద అవగాహనా సదస్సు, ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆయుర్వేద ప్రేమికులు, ఔషధ సేవనకులు పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. భ్రమరాంబ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ రాజుల ఆదేశాల మేరకు ప్రజల్లో ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.మధుమేహం, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ తదితర ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఆమె వివరించారు. వాత, పిత్త, కఫ త్రిదోషాలు, వాటి లక్షణాలు, నివారణ మార్గాలను సోదాహరణంగా వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా, ధ్యానం, సమతుల్య ఆహారం ఎంతో అవసరమని, వీటి ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.అనంతరం శిబిరానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరానికి అనుగుణంగా ఆయుర్వేద ఔషధాలను ఉచితంగా అందించారు. ఆయుర్వేద వైద్య విధానంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించి, ఈ వైద్యాన్ని ప్రతి ఇంటికీ చేరువ చేసేందుకు త్వరలో ‘ఇంటింటికి ఆయుర్వేదం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు డాక్టర్ భ్రమరాంబ వెల్లడించారు.భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో ఉందని ఆమె తెలిపారు. రోగాలను నియంత్రించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడే వైద్య విధానం కావడం వల్లనే దీనికి ‘ఆయుర్వేదం’ అనే పేరు వచ్చిందని వివరించారు.శ్రీ వాసవి విద్యానిధి ఆర్యవైశ్య బాలుర వసతిగృహం పాలకవర్గ కోశాధికారి నూనె రామాంజనేయులు మాట్లాడుతూ ఉచిత ఆయుర్వేద అవగాహనా సదస్సు, వైద్య శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ ఎం. భ్రమరాంబకు కృతజ్ఞతలు తెలిపారు.భాగవత ప్రచార సేవాసమితి అధ్యక్షులు, తెలుగు అధ్యాపకులు ఎం.వి.ఎస్. శాస్త్రి మాట్లాడుతూ ఆయుర్వేదం మానవుని ఆయుష్షును పెంపొందించే వైద్య విధానమని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నియంత్రణకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆయుర్వేద వైద్య విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయుర్వేద ఔషధాల వినియోగం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు సులభమైన మార్గాలు ఉన్నాయని తెలిపారు.విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు మాట్లాడుతూ ఆయుర్వేదం దైవానుగ్రహంగా భావించదగిన గొప్ప వైద్య విధానమని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కార్యక్రమంలో గిరిప్రదక్షిణ కమిటీ సభ్యులు కనమర్లపూడి బాలకోటేశ్వరరావు, ధనిశెట్టి రామునాయుడు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈమని బలరాం, వేమూరి చక్రధర పెరుమాళ్లు, పి. శ్రీనివాసులు, హరిబాబు, కార్యాలయ అధికారి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెర్మనిగా తీగల సత్యవతి వ్యవహరించారు.ఆయుష్ శాఖ సిబ్బంది ఎం. రమాదేవి, ఎం. శ్రీనివాసులు డాక్టర్ ఎం. భ్రమరాంబ సూచనల మేరకు శిబిరానికి హాజరైన వారికి ఔషధాలను పంపిణీ చేశారు.