సింగరాయకొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మోరుబోయిన మాలకొండయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు కోరారు. ఆదివారం సింగరాయకొండలోని సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, అభిమానులు పాల్గొని మాలకొండయ్య సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చైతన్యానికి కొత్త దిశానిర్దేశం చేసిన నందమూరి తారక రామారావుకు శిష్యుడిగా, బలహీనవర్గాల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మోరుబోయిన మాలకొండయ్య సింగరాయకొండ ప్రాంత రాజకీయ, సామాజిక అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన.. బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ, వారి కష్టసుఖాల్లో అండగా నిలిచిన ప్రజానాయకుడిగా మాలకొండయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.సింగరాయకొండ ప్రాంతంలో రాజకీయ చైతన్యం పెంపొందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ప్రజాసేవ చేసిన నాయకుల చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో మాలకొండయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన సేవలను శాశ్వతంగా స్మరించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర అనుమతులు, నిర్మాణ ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. విగ్రహ ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక నాయకులు, అభిమానులు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో న్యాయవాదులు సన్నిబోయిన శ్రీనివాసులు, మోరుబోయిన పద్మజ, సంగా రమణయ్య, షేక్ సందాని భాష, కూనపరెడ్డి సుబ్బారావు, చీమకుర్తి కృష్ణ, నక్క బ్రహ్మేశ్వరరావు, రాయి పేర్రాజు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *