తొలి శుభోదయం న్యూస్ తిరుపతి :-
తిరుపతిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ఆదివారం నాడు ఆ శాఖల మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష-సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందిస్తున్న స్పోర్ట్స్ డ్రెస్, నైట్ డ్రెస్, షూస్, టవల్స్ వంటి సౌకర్యాలు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు. కోటలోని ఎక్కలెన్స్ సెంటర్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతి పదంలో నడిపించాలన్నారు. అలాగే ట్రాన్స్జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, వారి కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు.