గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. పల్లె పండుగ–3 కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, తారురోడ్ల నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మండువారిపాలెం గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం మండువారిపాలెం నుంచి ఒంగోలు వరకు నిర్మించనున్న తారురోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తదుపరి పెద్ద దేవరంపాడు గ్రామంలో రూ.80 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం చింతాయిగారిపాలెం గ్రామంలో రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావడానికి ఈ హెల్త్ క్లినిక్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను మెరుగుపరచేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో సీసీ రోడ్లు, తారురోడ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని పేర్కొన్నారు. పల్లె పండుగ–3 ద్వారా గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఇంటి స్థల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసరావు, క్లస్టర్ కన్వీనర్ నల్లమోతు గంగాధర్, కామేపల్లి శ్రీనివాసరావు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డా. బాలాజీ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *