పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన…సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు శుక్రవారం చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్, పాటిమీదపాలెం, ఇస్లాంపేట ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు, ముందస్తు భద్రతా ప్రణాళికపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.చీమకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు, 13 పోలింగ్ లొకేషన్లు ఉండగా, వాటిలో 10 నార్మల్, 2 సెన్సిటివ్, 1 హైపర్ సెన్సిటివ్ లొకేషన్గా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత తదితర అంశాలను పరిశీలించి, ఎన్నికల విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల నిర్వహణ, పోలీసు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలవద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గత నెల రోజులుగా ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రౌడీషీటర్లు(చెడు నడత కలిగిన వ్యక్తులు)గతంలో ఎన్నికల సమయంలో అల్లర్లు లేదా ఇతర సమస్యలకు కారణమైన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో పల్లెనిద్ర, విలేజ్ విజిట్లు, నాకాబందీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఎన్ఫోర్స్మెంట్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తుమన్నారు. అదేవిధంగా ఆయుధాల డిపాజిట్, ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వినియోగించే వస్తువుల రవాణాను అరికట్టేందుకు చీమకుర్తి లో రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసినా, ప్రజలను రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ గారి ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, చీమకుర్తి మునిసిపల్ కమిషనర్ వై.రామకృష్ణయ్య మరియు సిబ్బంది ఉన్నారు.