రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో జనసేన పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు, నాయకుల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి అందజేశారు.ముందుగా ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త, హుడా చైర్మన్ షేక్ రియాజ్‌ను కలిసి ఆశావహుల జాబితాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో మాట్లాడి, మంత్రిని నేరుగా కలిసి వివరాలు తెలియజేయాలని సూచించినట్లు జనసేన నాయకులు తెలిపారు.అనంతరం మంత్రిని కలిసిన జనసేన నాయకులు కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఆశావహుల వివరాలను అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలం, నాయకుల ప్రజాసంబంధాలు, పార్టీ బలోపేతానికి వారు చేస్తున్న కృషిని పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో జనసేన పార్టీకి 30 శాతం వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటమిలో భాగస్వామ్య పార్టీగా జనసేనకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.ఈ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కూటమి నాయకులతో చర్చించి, అవసరమైతే మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కూడా సంప్రదింపులు జరిపి తదుపరి సమాచారం తెలియజేస్తామని పేర్కొన్నట్లు జనసేన నాయకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు కందుకూరి రాంబాబు, పిల్లిపోగు పీటర్ బాబుతో పాటు నియోజకవర్గ నాయకులు, నిర్వాహక దళ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *