కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, వేసవి సెలవులను విజ్ఞాన సముపార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు బాపట్ల పట్టణ విద్యార్థులు. స్థానిక పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారి ఏ.శివాజీ గణేశన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 28న ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 6 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుండి 11 గంటల వరకు కొనసాగనుంది.
ఈ శిబిరంలో భాగంగా గురువారం నాడు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, జనరల్ నాలెడ్జ్ ,కథల పఠనంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ వి. మహేష్ విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని, వారిరువురి దేశభక్తిని, వారు దేశానికి చేసిన అసమాన సేవలను విద్యార్థులకు వివరించారు.
విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో యోగా, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, చదరంగం, మట్టి బొమ్మల తయారీ వంటి అంశాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది , అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *