తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
గోల్డెన్ అవర్‌లో ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు — సహాయం చేసిన ‘రహ-వీర్’లకు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం-రాహత్ (PM RAHAT – Prime Minister Road Accident Health Assistance Team)” పథకం అత్యంత ఉపయోగకరమైనదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.రోడ్డు భద్రత (Road Safety) విషయంలో జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.PM రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో చేర్పించి, మొదటి 48 నుండి 72 గంటల ‘గోల్డెన్ అవర్’లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించబడుతుందని తెలిపారు.డబ్బులు లేకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, ముఖ్యంగా తీవ్ర గాయాలు పొందిన బాధితులకు ఇది ప్రాణరక్షకంగా నిలుస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తూ, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే “గుడ్ సమారిటన్”లకు చట్టపరమైన రక్షణ కల్పించబడిందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవని స్పష్టం చేశారు.“గుడ్ సమారిటన్” కాన్సెప్ట్‌ను ప్రోత్సహించే భాగంగా, రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్పించి ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేసే వారికి రూ.25,000 నగదు పురస్కారం అందజేయబడుతుందని తెలిపారు.ప్రాణాలను కాపాడటం మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ప్రజలు ముందుకు వచ్చి ప్రమాదాలపై వెంటనే స్పందించి, బాధితులకు అత్యవసర సహాయం అందించాలని పిలుపునిచ్చారు.