కొండపి నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొండపి నియోజకవర్గ స్థాయి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కత్తి శ్రీనివాసులు, శ్రీ ఆవుల శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ శ్రీ ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒకటి మరియు రెండు తరగతుల విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. కొండపి నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు ఇతర మండలాల నుండి మొత్తం 140 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని చెప్పారు.
తొమ్మిది మంది డీఆర్‌పీలు సెషన్ల వారీగా గణితం, తెలుగు, ఆంగ్లం, జాతీయ విద్యా విధానం–2020, ఆరోగ్య విద్య, దీక్ష యాప్, లీప్ యాప్, స్పెల్ బీ, జాదూయి పిటారా, టీఎల్‌ఎం తయారీ, మిస్ కాన్సెప్ట్స్ గుర్తింపు, బోధనలో సాంకేతికత వినియోగం తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
మండల విద్యాశాఖ అధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శిక్షణార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, మజ్జిగ తదితర సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో బి. శ్రీనివాసరావు, రమణారెడ్డి, కీర్తి శ్రీనివాసరావు, రవీంద్ర, మాధవతో పాటు పొన్నలూరు, టంగుటూరు, జరుగుమల్లి మండలాలకు చెందిన డీఆర్‌పీలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన లక్ష్యాలను సాధించడమే ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
