క్రీడలు, వినోదం, సంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ముగిసిన సమ్మర్ క్యాంప్
చిన్నారులు వారి బాల్య దశ నుండే బంగారు భవిత వైపు అడుగులు వెయ్యాలి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకలు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ గారు మాట్లాడుతూ, సమ్మర్ క్యాంపులో చిన్నారులకు ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణంలో వివిధ రకాల జట్టు క్రీడలు, వ్యక్తిగత క్రీడలు, టీమ్ బిల్డింగ్ గేమ్స్, ఫిట్నెస్ కార్యక్రమాలు మరియు ఇతర శారీరక విద్యా కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ క్యాంపు ద్వారా చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు, జట్టు భావన, స్నేహపూర్వకత వంటి విలువలు పెంపొందడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడిందని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు చెప్పే మంచి విషయాలను ఆచరిస్తూ విద్యలో రాణించి, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంపులో నిర్వహించిన ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, క్రికెట్, వాలీబాల్, లగోరి, ఖోఖో పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు డిఎస్పీ గారు మెమెంటోస్ మరియు సర్టిఫికెట్స్ అందచేసినారు. క్యాంప్ విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర, పిఈటి విద్యార్థులను డిఎస్పీ గారు అభినందించారు
ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణ రెడ్డి, ఆర్ ఎస్సైలు ప్రసాదు,సురేష్ సిబ్బంది, చిన్నారు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
