తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నిరుపేద ప్రజల కోసం ఉద్యమ బాట పట్టి తుదిశ్వాస వరకు ఎర్ర జెండా నీడలో అనేక శ్రామికుల పక్షాన పోరాడిన యోధుడు కామ్రేడ్ సుదర్శి పాలస్ అని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకయ్య అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ సుదర్శి పాలస్ 11 వ వర్ధంతి వేడుకలు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కామ్రేడ్ సుదర్శి పాలస్ తుది శ్వాస వరకు నమ్ముకున్న కమ్యూనిజం సిద్ధాంతంలో ఎర్రజెండాను ముద్దాడి అమరుడైన కమ్యూనిస్టు యోధుడు అని అన్నారు. సుదర్శి పాలస్ లాంటి గొప్ప పోరాట వీరుడి 11వ వర్ధంతిని జరుపుకొని ఆయన చేసిన పోరాటాలను ఈనాటి కమ్యూనిస్టులకు వివరించటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పాలస్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం నేటి కమ్యూనిస్టులకు ఉందని ఆయన అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా అందరి మనసులలో నిలవటం అందరికీ సాధ్యం కాదని అలాంటి వారిలో పాలస్ ఉండడం మన కందుకూరు ప్రాంతం అదృష్టమని ఆయన అన్నారు. పాలస్ తన పోరాటాలు తనతోనే అంతమవుకుండా కుటుంబానికి సైతం ఉద్యమాల ఓనమాలు దిద్ది వారిని సైతం ప్రజాసేవకే అంకితం చేయటంలో ప్రధమ పాత్ర పోషించటం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. అలాంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని పోవటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులు అని ఆయన తెలిపారు. ఆరు దశాబ్దాల క్రిందటే ఉన్నత విద్య అభ్యసించి ప్రజల కోసం ఉన్నత ఉద్యోగాలను వదిలి ఉద్యమ బాట పట్టిన పోరాట యోధుడు పాలస్ అని అన్నారు. బలహీన వర్గాల సమస్యల పరిష్కారం పెత్తందారుల ఆగడాలను అరికట్టాలన్న లక్ష్యం ఉన్న భావజాలంతో తుదిశ్వాస వరకు పోరాడిన వ్యక్తి పాలస్ అని అన్నారు. ఆయన పోరాటాలు ఆనాటికి ఈనాటికీ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన నిజమైన కమ్యూనిస్టు పోరాట యోధుడు పాలస్ అని అన్నారు. ముందుగా పాలస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి పి.బాలకోటయ్య, ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్, సిపిఐ నాయకులు ఉప్పుటూరి మాధవరావు, లక్ష్మీనారాయణ బొల్లోజుల బాల బ్రహ్మచారి ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు చేవూరి దుర్గాప్రసాద్, బొజ్జా చంద్రమోహన్, కోటేశ్వరరావు, కుంచాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.