తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం గారు మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 15 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి ఆదేశాల మేరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.రక్తదానం మహాదానమని, ఒక యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు. రక్త నిల్వలు సమృద్ధిగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో చికిత్స అందించవచ్చని వివరించారు.రక్తదానం చేయడం వల్ల దాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని, శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా రక్త సేకరణ జరుగుతుందని తెలిపారు. యువత స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టౌన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీను, కొండముడిసిపాలెంకు చెందిన కల్వకురి మాధవ్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది అరుణ, రామారావు, సుకుమార్, ఆదామ్ తదితరులు పాల్గొన్నారు