తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసు బృందాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాయి.ఈ తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల లైటింగ్, సెక్యూరిటీ గార్డుల విధులు, ఏటీఎం కేంద్రాల పరిసర భద్రత వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్కిమ్మింగ్ పరికరాలు లేదా ఇతర మోసపూరిత చర్యలు జరగకుండా బ్యాంకు అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.అదేవిధంగా, నగదు ఉపసంహరణ సమయంలో అపరిచితుల సహాయం తీసుకోవద్దని, ATM PIN, OTP వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల ఆస్తుల రక్షణ, ఆర్థిక భద్రత, మోసాల నివారణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.