తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో… P4( పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్ షిప్) బ్లాక్ ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది విధులు, వారి పనితీరును పరిశీలించారు. గ్రామాల వారీగా ఎంతమంది పేదలను గుర్తించారు, ఏయే సమస్యలపై వివరాలు సేకరించారు, ఈ ఏడాది కాలంలో తయారుచేసిన రిపోర్టులు… తదితర అంశాలను ఎమ్మెల్యే సమీక్ష చేశారు. గ్రామాలలో జీవనాధారం లేని నిరుపేదలతో పాటు తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒంటరి వృద్ధుల సమాచారాన్ని పూర్తిగా సేకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదేశించారు. వారికి ప్రభుత్వం, దాతల ద్వారా సహాయం అందేటట్లుగా పనిచేయాలని సూచించారు. అలాగే గ్రామస్థాయిలో ప్రజలు కోరుకుంటున్న అంతర్గతరోడ్లు, పొలాలకు వెళ్లే డొంక రోడ్లు, స్మశానాలు లాంటి మౌలిక వసతులు కూడా గుర్తించాలన్నారు. ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో సర్వే చేసి, తమకు తెలియజేస్తే, వాటి ప్రకారం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు తమకు సమాచారం సరిగా ఇవ్వటం లేదని కార్యాలయ సిబ్బంది ఎమ్మెల్యే కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు, వెంటనే ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. P4 సిబ్బందికి అవసరమైన సమాచారం కచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే పన్ను వసూళ్ల పైనా ఎమ్మెల్యే సమీక్ష చేశారు. మండలంలో పంచాయతీల వారీగా పన్ను వసూళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మోపాడు, మాచవరం, కొండికందుకూరు, నరిశెట్టివారిపాలెం గ్రామాలలో పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ నెలాఖరులోగా 95 శాతం పన్నులు వసూలు చేయాలని, అప్పుడే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధులు సర్దుబాటు అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *