రూ. 60 వేల విలువైన ఇన్వర్టర్ విరాళం
విద్యార్థినులకు పెన్నులు, స్వీట్ల పంపిణీ
అధికారి హోదాలో ఉండి సామాజిక బాధ్యత చాటుకున్న ఇసాక్
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయడమే కాకుండా, సామాజిక బాధ్యతతో విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవవచ్చని గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ పి. ఇసాక్ నిరూపించారు. గిద్దలూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం-1 లో చదువుకుంటున్న విద్యార్థినులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకారంతో బుధవారం సుమారు రూ. 60,000 విలువైన భారీ ఇన్వర్టర్ సెట్‌ను బహుకరించారు. వసతి గృహంలో విద్యుత్ కోతలు ఏర్పడటం వల్ల విద్యార్థినులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఇసాక్ దృష్టికి రాగా స్పందించిన ఆయన, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకారంతో ఇన్వర్టర్ కొనుగోలు చేసి వసతి గృహానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో వెనుకబడకూడదని, ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యుత్ సమస్యలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయని, అందుకే ఈ చిన్న సాయం చేయదలచామని తెలిపారు. అలాగే విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశించారు. అలాగే విద్యార్థినులందరికీ అవసరమైన పెన్నులను మరియు మనోల్లాసం కోసం స్వీట్లను పంపిణీ చేశారు. ఒక ఉన్నత అధికారి తమ వసతి గృహానికి వచ్చి తమ కష్టాలను తీర్చడమే కాకుండా, తమతో కలిసి సమయాన్ని గడపడం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల హోదాలో ఉండి కూడా విద్యార్థుల అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సబ్ రిజిస్ట్రార్ కి, వారి కార్యాలయ సిబ్బందికి వసతి గృహ వార్డెన్ జయమ్మ మరియు విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.