తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థల్లో విద్యార్థులకు సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలు, పోక్సో (POCSO) చట్టం, యాసిడ్ దాడుల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా వివరించారు.అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాలు వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులను నమ్మవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.మాదకద్రవ్యాల (గంజాయి, డ్రగ్స్) వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించి, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.అలాగే గొలుసు లాక్కునే (చైన్ స్నాచింగ్) ఘటనల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్త క్రిమినల్ చట్టాల ప్రధాన అంశాలు, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.సమాజంలో చట్టాల పట్ల గౌరవం, మహిళల పట్ల మర్యాద, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల రహిత జీవనం, రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పోలీసులు పిలుపునిచ్చారు.