తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణకు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబీస్ నిరోధక టీకాలు వేయించాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డా. ఎన్. హజరత్ సూచించారు.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సింగరాయకొండ పశు వైద్యశాలలో యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పెంపుడు కుక్కలు, పిల్లులకు నిర్ణీత వ్యవధిలో యాంటీ రేబీస్ టీకాలు తప్పనిసరిగా వేయించాలని, జంతువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప పశు వైద్యశాలలో చికిత్స చేయించాలని సూచించారు. అలాగే పెంపుడు జంతువుల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ విషయంలో యజమానులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 53 పెంపుడు కుక్కలు, పిల్లులకు యాంటీ రేబీస్ టీకాలు వేశారు. కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది, పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు.