సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరస్పర రాజీ ద్వారా వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “లోక్ అదాలత్ అనేది ప్రజలకు సులభ, వేగవంతమైన మరియు శాశ్వత న్యాయ పరిష్కారాన్ని అందించే ప్రజాహిత వేదిక. రాజీ ద్వారా కేసులు పరిష్కారమైతే కక్షిదారుల మధ్య సత్సంబంధాలు కొనసాగడంతో పాటు సమయం, ధనం కూడా ఆదా అవుతాయి. భవిష్యత్తులో కూడా లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందిస్తుంది” అని పేర్కొన్నారు.ప్రామిసరీ నోటు ఆధారంగా దాఖలైన ఒక సివిల్ దావాలో ప్లైంటిఫ్‌కు అనుకూలంగా డిక్రీ వెలువడిన అనంతరం దాఖలైన ఎగ్జిక్యూషన్ పిటిషన్‌లో, కోర్టు సమక్షంలో డిఫెండెంట్ రూ.1,75,000 నగదును 75 సంవత్సరాల వయోవృద్ధుడైన డిక్రీ హోల్డర్‌కు న్యాయమూర్తి సమక్షంలో చెల్లించారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదానికి శాశ్వత పరిష్కారం లభించగా, లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం అందించిన మరో ఉదాహరణగా నిలిచింది.లోక్ అదాలత్ ప్యానల్ న్యాయవాదులుగా బి.వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర సేవలందించారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సుధాకర్ నాయుడు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు, వంశీ, రియాజ్, కోదండపాణి, సురేష్, నాగరాజు, శ్రీనివాసులు, శ్రీలక్ష్మి, వాసంతి , పోలీసు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన కక్షిదారులకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *