తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సంచార జాతుల వారు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచార జాతుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, సంచార జాతుల పిల్లలను ఏ పాఠశాలలోనైనా చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.సంచార జాతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే P4 విధానం ద్వారా గృహ వసతి కల్పనతో పాటు, ఎన్జీవోల సహకారంతో జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.సంచార జాతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం వారి పిల్లల విద్య, జీవనోపాధి, ప్రస్తుతం చేస్తున్న వృత్తులు, వారికి అవసరమైన సహాయ సహకారాలపై అవగాహన పొందడమేనని కలెక్టర్ పేర్కొన్నారు. సంచార జాతులకు పురాతన చరిత్ర ఉందని, జంగం, దాసరి, పాముల, మొండి బండ, బుడబుక్కల వంటి వర్గాలు శతాబ్దాలుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయని చెప్పారు. సంచార జాతుల వారు అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర సంచార జాతులకు చెందిన మౌనిక, లలితమ్మ, వెంకటమ్మ, శ్రీనివాసరావు, లక్ష్మ, చిన్నమ్మ తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.సంఘ నాయకుడు చెంచయ్య మాట్లాడుతూ, సంచార జాతుల వారికి బ్యాంకు లింకేజీల అవసరం లేకుండా సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు పొగడ్తల చిన్న చెంచయ్య, జంగమ సంఘం అధ్యక్షుడు ముసునూరి కోటేశ్వరరావు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య, సంచార జాతుల జిల్లా సంఘం అధ్యక్షుడు పొగడ్తల వెంకటేశ్వర్లు, సంచార జాతుల యువజన అధ్యక్షుడు చిన్నకత్తుల రాజేష్, పాముల సంఘం అధ్యక్షుడు నాగులూరి దాయాది, పాముల సంఘం కార్యదర్శి నాగులూరి సామ్యూల్తో పాటు జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర సంచార జాతుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.