ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 90 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ఫిర్యాదిదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)’ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదిదారులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు కలిసి ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సివిల్, భూ/ఆర్థిక తగాదాలు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ గారు చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో జిల్లా ఎస్పీ గారు ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, పోలీసు కార్యాలయాలకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించి, సత్వర న్యాయం అందుతుందనే నమ్మకాన్ని కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్, ఒంగోలు వన్ టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ రమేష్, అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జున రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
