వలేటివారిపాలెం నుంచి రాళ్లపాడు రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు
6 చోట్ల చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు 137 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు…. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. శనివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిసి పలు ప్రతిపాదనలను ఆయనకు అందజేశారు.ప్రధానంగా కందుకూరు – ఉదయగిరి నియోజకవర్గాలను అనుసంధానం చేసే రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారికి నాగేశ్వరరావు వివరించారు. వలేటివారిపాలెం నుంచి లింగసముద్రం మీదుగా రాళ్లపాడు రిజర్వాయర్ వరకు 12 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును వెడల్పు చేసి, డబుల్ రోడ్డుగా మార్చాలని విన్నవించారు. పెరిగిన వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కొత్తగా తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అందుకోసం 25 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ఇక రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ జలాలను పెంచాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో 6 చోట్ల చెక్ డ్యాముల నిర్మాణానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ప్రతిపాదనలు తయారు చేయించి ముఖ్యమంత్రి గారికి అందజేశారు. పాలేరు నదిపై కందుకూరు మండలం పలుకూరు వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి 25 కోట్లు, విక్కిరాలపేట వద్ద నిర్మాణానికి 23 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఉప్పుటేరుపై గుడ్లూరు వద్ద నిర్మాణానికి 19 కోట్లు, లింగసముద్రం మండలం చినపవని వద్ద నిర్మాణానికి 18 కోట్లు మంజూరు చేయాలన్నారు. ఇంకా వలేటివారిపాలెం మండలం శామీరపాలెం (కూనిపాలెం) వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి 3 కోట్లు, మన్నేరుపై కలవళ్ల వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి 24 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు. అందుకు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇంకా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఇంటూరి, ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో కందుకూరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగ యువకులకు భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.