తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ గారు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున గారి పర్యవేక్షణలో మెదరమెట్ల ఎస్సై టి. రమేష్ బాబు ఆధ్వర్యంలో సుమారు 350 మంది పాల్గొని,రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, రాధా గీతం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆటో, లారీ డ్రైవర్లు, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ మెదరమెట్ల గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల గుండా సాగింది. రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలు, వాహనదారుల్లో అవగాహన కల్పించారు.
ప్రజలకు మరియు వాహనదారులకు పలు ముఖ్యమైన సూచనలు తెలియజేశారు.
*ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించాలి.
*నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి.
*మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదు.
*అతివేగం, నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనాలు నడపరాదు.
*వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదు.
*ట్రాఫిక్/ రోడ్డు భద్రత నియమాలు, రహదారి సూచికలు, ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పనిసరిగా పాటించాలి.
*పాదచారులు, అత్యవసర సేవల వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణించరాదని, అలాగే ఆటోల్లో నిర్దేశిత సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు.
అనంతరం నిర్వహించిన మానవహారం ద్వారా “ప్రతి ప్రాణం అమూల్యం – రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజలకు చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఎస్సై టి. రమేష్ బాబు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, లేన్ క్రమశిక్షణను పాటిస్తూ ఓవర్టేకింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.