తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యురాలు డ్యూటీ డాక్టర్ రమాప్రియా సమయస్ఫూర్తితో స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించడం ద్వారా గుండెపోటుకు గురైన ఓ రోగి ప్రాణాలను కాపాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలతో పాటు ఖరీదైన ప్రాణరక్షక మందులు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.శుక్రవారం సాయంత్రం కందుకూరు పట్టణంలోని జనార్ధన కాలనీకి చెందిన పల్లి మల్లికార్జునకు అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పి, గుండెపోటు లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ప్రాణాలను కాపాడేందుకు వెంటనే థ్రాంబోలిసిస్ చికిత్స అవసరమని, ఇందుకు సుమారు రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువ చేసే టెనెక్టెప్లేస్ (Tenecteplase) ప్రాణరక్షక ఇంజెక్షన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉంటుందని సూచించి కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వెంటనే విధుల్లో ఉన్న వైద్యురాలు డాక్టర్ రమాప్రియా రోగిని పరీక్షించి గుండెపోటు తీవ్రతను గుర్తించారు. అనంతరం జనరల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ తులసిరామ్‌కు సమాచారం అందించి, ఆయన సూచనల మేరకు ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సుమారు రూ.40 వేల విలువైన టెనెక్టెప్లేస్ ప్రాణరక్షక ఇంజెక్షన్‌ను ఉచితంగా రోగికి అందించి థ్రాంబోలిసిస్ చికిత్స నిర్వహించారు.సమయానికి చికిత్స అందడంతో రోగి పరిస్థితి నిలకడగా మారింది. తదుపరి వైద్యం అయినా యాంజియోగ్రామ్ మరియు మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు డాక్టర్ రమాప్రియా, డాక్టర్ తులసిరామ్, విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అత్యవసర విభాగం సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక వ్యయంతో అందించే అత్యవసర గుండెపోటు చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించడం పట్ల ప్రభుత్వ వైద్య సేవలను వారు ప్రశంసించారు.