ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కంభం అర్బన్ కాలనీలోని కందులాపురం రైల్వే-2 అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సూపర్‌వైజర్ గాలెమ్మ మాట్లాడుతూ, శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. మొదటగా వచ్చే పసుపు రంగు చిక్కటి ముర్రుపాలు శిశువుకు అమృతంతో సమానమని, వాటిలో ఉండే పోషకాలు, ప్రతిరక్షక శక్తి కలిగిస్తూ, బిడ్డను అనేక రకాల అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని వివరించారు.
జననం నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు, తేనె లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని సూచించారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడటంతో పాటు తల్లి ఆరోగ్యానికీ మేలు చేస్తాయని తెలిపారు.
అనంతరం తల్లులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి, తల్లిపాలపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. శిశువుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, బిడ్డలకు తల్లిపాలను తప్పనిసరిగా అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పి. శ్రీదేవి, బి. ఆదిలక్ష్మి,గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *