నిర్మాణం ఆపకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరిక
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్ను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ మాలపల్లె నివాస ప్రాంతంలో సెల్ఫోన్ టవర్ నిర్మించడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆరోపించారు. టవర్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, యువత భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే సంబంధిత శాఖలైన గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయం తదితర అధికారుల అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరారు.
ఈ మేరకు టంగుటూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓకు బాపూజీ కాలనీ ప్రజలు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు, కె.వి. కృష్ణారావు, టి. క్రాంతి కుమార్, కె. రాజు, సతీష్, దిలీప్, వంశీతో పాటు కాలనీ యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
నివాస ప్రాంతంలో నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్ను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
