తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ, ఆగస్టు 5: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సుందర్‌నగర్‌లో కొత్త మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.పాఠశాల విద్యాశాఖ ప్రాజెక్ట్-I విభాగం జీవో ఆర్.టి. నెం.131, తేదీ 05-08-2026 ద్వారా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో బోధన అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ పాఠశాలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రారంభించేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, పాఠశాలకు శాశ్వత UDISE కోడ్ కేటాయించేందుకు కూడా అనుమతించింది.గతంలో సుందర్‌నగర్‌లో ఉన్న పాఠశాల మూతపడడంతో, అక్కడి విద్యార్థులు విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చొరవతో, ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీ కుటుంబాల చిన్నారులకు సమీపంలోనే నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు.అంతేకాకుండా, ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ సమ్మతి కూడా లభించినట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.సుందర్‌నగర్ ప్రాంతంలోని చిన్నారులకు సమీపంలోనే ప్రభుత్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.