తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా.శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శుక్రవారం జరుగుమల్లి మండలం పాలేటిపాడులో జేసీ కల్పనా కుమారితో కలిసి మంత్రి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…గత ప్రభుత్వం పాసు పుస్తకాల మీద, ప్రభుత్వం ప్రజలకి ఇచ్చే ఇళ్ల స్థలాల హద్దు రాళ్ళ మీద కూడా వాళ్ల ఫోటోలు , పేర్లు వేసుకుని రూ. 600 కోట్ల ప్రజా ధనం వృథా చేసిందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రాజ ముద్రతో నూతన పట్టా దారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గర్భ కండ్రిక, చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతు సంక్షేమమే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నదాత సుఖీభవతో దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టుబడి సాయం కోసం ఏడాదికి రూ. 20 వేలు ఇస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సబ్సిడీకి వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నారు. కష్ట కాలంలో పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గతేడాది రూ. 300 కోట్లతో బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. వెలుగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు అన్నదాత సుఖీభవ,దీపం -2 పథకం, ఉచిత బస్సు,తల్లికి వందనం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలేటిపాడు గ్రామంలో రూ. 70 లక్షలతో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మించామన్నారు. త్వరలోనే గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.