మార్కాపురం జిల్లా కంభం మండలం విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్టాఫ్ సమావేశంలో ఉపాధ్యాయులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈవో అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఒక విద్యార్థి వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరైతే, కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత విద్యార్థి ఇంటిని ఉపాధ్యాయులు సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలను సమగ్రంగా తెలుసుకుని, తిరిగి పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. తరగతి గదిలో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచేలా బోధన పద్ధతులను అవలంబించాలని, మిషన్ మార్చి–27 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎంఈవో ఆదేశించారు. విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్దేశించిన కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. స్టడీ అవర్స్‌ను సమయ పాలన పాటిస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, క్రమశిక్షణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులతో సమన్వయం పెంచుకోవడం ద్వారా విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.ఈ సమావేశంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కంచి రామారావు, సీఆర్పీ మురళీ మోహన్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *