మార్కాపురం పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ.. “స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన పండుగ. మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజం, రాష్ట్రం, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని అన్నారు.
“మార్కాపురం నియోజకవర్గంలోని యువత, రైతులు, ప్రజలు ఎల్లప్పుడూ ఇలాంటి పండుగ వాతావరణంలో ఆనందంగా ఉండేలా, మన ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా కృషి చేస్తాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమానికి తోడ్పాటు అందించడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
స్వాతంత్ర్య వేడుకలు కేవలం ఒకరోజు నిర్వహించే కార్యక్రమంగా కాకుండా, దేశం పట్ల బాధ్యతను గుర్తుచేసే స్ఫూర్తిదాయకమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ భావించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, యువత, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *