కోరుతూ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఐ ఎఫ్ టి యు ధర్నా
తొలి శుభోదయం న్యూస్ విజయవాడ:-
భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురై మరణానికి గురైతే 10 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు, హాస్పిటల్లో చికిత్స పొందేటప్పుడు హాస్పిటలైజేషన్ అలవెన్సులు ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు గతంలో అమలు చేసినట్లు 14 సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (ఐయఫ్ టి యు అనుబంధం ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్,మోహన్, కెవి రమణ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా, హాస్పిటలైజెషన్ సహాయం తో పాటు గత సంక్షేమ పధకాలు అన్ని పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (IFTU) ఆధ్వర్యంలో ఆగస్టు 31 వతేది సోమవారం ఉదయం విజయవాడలో గల రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బివోసి బోర్డులో తగినన్ని నిధులు ఉన్నాయని అయినా ఆ పధకాలలో కోత విధించడం న్యాయం కాదన్నారు. ముఖ్యంగా గతంలో ఇప్పుడు అనేక మంది ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని, చేతులు, కాళ్ళు కోల్పోయి, నడుములు విరిగి శాశ్యత వైఖల్యానికి గురౌతున్నా బోర్డు నుండి ఎలాంటి పరిహారం, సహాయం అందడం లేదన్నారు. ఈ ధర్నాలో ఇటీవల నూజివీడులో పనిచేస్తూ చేయి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుడు పందిరపల్లి శివకృష్ణ తన మొండి చేయితో పాల్గొని రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల స్థితిని వెల్లడించాడు. అనంతరం రాష్ట్ర కమిషనర్ ఆఫ్ లేబర్ గంధం చంద్రుడు గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే గతంలో రెండు లక్షలు నష్టపరిహారం ఇచ్చే వారిని ఆ కుటుంబానికి ఆ రోజులలో ఆ డబ్బు ఎంతో ఆసరాగా నిలిచేదని అన్నారు అదేవిధంగా కార్మికుడు ప్రమాదంలో అంగవైకల్యం జరిగి చేయి, కాలు కోల్పోతే ఐదు లక్షల వరకు నష్టపరిహారం వచ్చేదని ఇప్పుడు ఆ పథకం లేదని ఈ ధర్నాలో పాల్గొన్న నూజివీడు పందిరిపల్లి శివకృష్ణ అనే కార్మికుడికి చెయ్యి కోల్పోతే బిల్డింగ్ యజమాని గాని, బిల్డర్ గాని రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. సంక్షేమ బోర్డులో అంగవైకల్య పథకం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. సమస్యలను సానుకూలంగా విన్న కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. రాష్ట్ర లేబర్ కమీషనర్ గారితో జరిగిన చర్చల అనంతరం ధర్నా కు హాజరైన కార్మికులను ఉద్దేశించి సంఘం ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 18 తేదీన జీవో నెంబర్ 6 విడుదల చేసిందని, ఈ జీవోలో కేవలం మూడు సంక్షేమ పథకాలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్నట్లు, మార్చి 1వ తేది నుంచి అమలులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రధానమైన భవన నిర్మాణ కార్మికుల ప్రమాద భీమాను, ప్రమాదం జరిగినప్పుడు హాస్పటల్లో చికిత్స కోసం అమలు చేసి హాస్పిటలైజేషన్ భీమాను నిరాకరించారు. మొత్తం 14 సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, సెస్ రూపంలో గత 12 సంవత్సరాల్లో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు 5,186 కోట్ల రూపాయలు జమ అయ్యాయని అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఖర్చు చేసింది కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆ 1500 కోట్ల రూపాయల్లో కూడా తల్లికి వందనం వంటి ఇతర పథకాలకు 1239.91 కోట్ల రూపాయలు మళ్ళించారని గుర్తు చేశారు. బోర్డు నిధుల్లో కార్మికుల సంక్షేమం కోసం కేవలం 260.87 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసిన నిధులను మంచినీటి చలివేంద్రం పేరుపై వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువలన ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా తోపాటు 14 సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజేషన్ తో పాటు మాన్యువల్ కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఈ గ్రీష్మ కుమార్, ఎం నాగరాజు, ఎన్ ఎస్ రాజు, పి అక్కల నాయుడు, కాకర్ల శ్రీను, బి గోవిందరావు, సిహెచ్ వెంకట్రావు, పి ప్రసాద్, పామర్తి సత్యనారాయణ, ఏ దేవుడు, ఎన్ నాంచారి బాబు, సిహెచ్ రంగారావు, టీ నాగేశ్వరరావు, ఎర్ర శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
