తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ఈ సందర్భంగా గౌరవ మంత్రులు, ఎంపీ, సహచర శాసనసభ్యులతో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ప్రారంభ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మార్కాపురం, ప్రకాశం జిల్లాల ప్రజలకు శాశ్వత ఉపశమనం కలిగేలా చంద్రబాబు గారి సారథ్యంలో వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నదని తెలిపారు. సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు గారే శంకుస్థాపన చేశారని, తిరిగి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా, అంతా తానే చేసినట్లు జగన్ చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని నాగేశ్వరరావు అన్నారు.
మూడు దశాబ్దాల ప్రజల ఎదురుచూపులు ఫలించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగంగా పూర్తిచేసి మొదటి ఫేజ్ పనులను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. కందుకూరు ప్రాంతంలోని రాళ్లపాడు రిజర్వాయర్, పాలేరు నదికి కూడా వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. రైతుల కోసం ఒక్కొక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు అపర భగీరధురడిలా మారారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు.