సీఎం, డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే ఇంటూరి విజ్ఞప్తి
తాగు, సాగు నీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వినతి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
వెలుగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కందుకూరు నియోజకవర్గానికి తరలిస్తే…. సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వ పెద్దలకు విన్నవించారు. మంగళవారం ఉదయగిరి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రిప్రజెంటేషన్ ఇచ్చారు.
అన్ని చెరువులు నింపేలా….
నియోజకవర్గంలోని వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే వినతి పత్రం అందించారు. వెలిగొండ తూర్పు కాలువ 103 వ కిలోమీటరు నుంచి ప్రత్యేక కాలువ ద్వారా మూడు మండలాల్లోని చెరువులను కృష్ణా జలాలతో నింపాలని కోరారు. వెలిగొండ తూర్పు కాలువ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి, ఆ మధ్యలో ఇరువైపులా చెరువులకు నీటిని మళ్లించేలా చూడాలన్నారు. పాలేరు, మన్నేరు మధ్య ప్రాంతంలోని అన్ని చెరువులకు నీరు అందించగలిగితే శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. వలేటివారిపాలెం మండలం మొదలుకొని కందుకూరు మండలంలోని పలుకూరు చెరువువరకు కృష్ణా నీళ్లు పారించేలా సర్వే చేయించి, నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
రాళ్లపాడు రిజర్వాయర్ ద్వారా….
వెలిగొండ ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు రిజర్వాయర్ కు పూర్తిస్థాయిలో నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మెమొరాండం అందజేశారు. వెలుగొండ ప్రాజెక్టు తూర్పు కాలువ ద్వారా 129 వ కిలోమీటర్ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా రాళ్లపాడుకు 1.7 టీఎంసీల నీటి విడుదల కోసం గతంలో జీవో కూడా ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అది కార్యరూపం దాల్చితే సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటితోపాటు వలేటివారిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు మండలాలకు తాగునీరు అందుతుందని వివరించారు. భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సభ వేదికపై ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ…. రాళ్లపాడు రిజర్వాయర్ ద్వారా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అంతకుముందు హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గార్లకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్వాగతం పలికారు.