తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీసులు దర్శి పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దర్శి–పొదిలి రోడ్డులో హెల్మెట్ లేకుండా బాణంలా దూసుకుపోతూ మోటార్ సైకిళ్లు నడుపుతున్న వాహనదారుల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, అధిక వేగం వల్ల కలిగే ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. హెల్మెట్ వాడకంతో ప్రాణాలను కాపాడుకోవచ్చని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని తెలియజేశారు.
దర్శి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించి, తమ కుటుంబ భద్రత కోసం బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.