తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరులోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ శ్రీమతి వి. షాలిని రెడ్డి గారు ప్రారంభించి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యత, ప్రతి ఓటు విలువ, మంచి నాయకుడి లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాల్సిన అవసరం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలను అలవర్చుకోవడం భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియను నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల పరిచయం, ప్రచారం, రహస్య ఓటింగ్, ఓట్ల లెక్కింపు వంటి దశల్లో పారదర్శకంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పారు.పుస్తక విద్యతో పాటు జీవితానికి అవసరమైన నాయకత్వం, బాధ్యత, క్రమశిక్షణ, నిర్ణయ సామర్థ్యం వంటి విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. శివకుమార్ యాజమాన్య సభ్యులు వి.మర్రేడ్డి గారు, కే.శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలను విజయవంతం చేశారు. కార్యక్రమం చివర్లో ఎన్నికైన ప్రతినిధులను అభినందిస్తూ, విద్యార్థుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.