హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాల పట్ల వాహనదారులకు వివరిస్తున్న పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు,ఐ.పి.యస్. ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, వారికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలు, ప్రాణ నష్టం ఎలా జరుగుతుందో ఉదాహరణలతో వివరించారు. హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడే అత్యంత ముఖ్యమైన రక్షణ సాధనమని పోలీసులు స్పష్టంగా తెలియజేశారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించడమే కాకుండా, మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటించని వాహనదారులపై ఎం.వి చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ కొనసాగిస్తున్నారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.చట్ట వ్యతిరేక / అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, గంజాయి వంటి మాదకద్రవ్యాల మరియు ఇతర అనుమానిత వస్తువులు రవాణా జరగకుండా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.