తొలి శుభోదయం ప్రకాశం:-
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజల భద్రతకు భంగం కలగకుండా, పరిసరాల పరిశుభ్రతను కాపాడేందుకు మరియు నేరాలు నియంత్రణ కొరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రక్రియను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ లు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, అకతాయిల అల్లర్లు, చిన్న చిన్న ఘర్షణలు, మహిళలు మరియు వృద్ధులకు కలిగే ఇబ్బందులను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.బహిరంగ మద్యం సేవించేందుకు స్థావరాలుగా మారిన ప్రదేశాలను గుర్తించి, వాటిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు స్వయంగా చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మద్యం సేవించే వ్యక్తులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసి, గ్రామాలు మరియు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను వారికి గుర్తు చేస్తున్నారు.ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటివరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన 231 ప్రదేశాలను గుర్తించగా, వాటిలో 193 ప్రదేశాలను ఇప్పటికే శుభ్రం చేయడం జరిగింది. అదే విధంగా మార్కాపురం జిల్లాలో మొత్తం 313 ప్రదేశాలను గుర్తించగా, వాటిలో 304 ప్రదేశాలను శుభ్రం చేశారు. మిగిలిన ప్రదేశాలను కూడా శుభ్రపరిచే కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. పోలీసు సిబ్బంది స్వయంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా అక్కడ మళ్లీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించవచ్చని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన నేరాలకు అవకాశం తగ్గి సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమన్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని గమనించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. అదేవిధంగా, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేసి పోలీస్ శాఖ వాట్సాప్ నెంబర్ 9121102266 కు పంపవచ్చని లేదా 112 కు డయల్ చేయవచ్చని సూచించారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.