తొలి శుభోదయం ప్రకాశం:-
మహిళల భద్రత, ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’ (Shakti App) పై ముమ్మర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద హెచ్‌క్యూ టీమ్-1 ఆధ్వర్యంలో మహిళలు, ప్రయాణికులకు యాప్ విశిష్టతను వివరిస్తూ వారి మొబైళ్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు. మార్కాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు వాగ్దేవి కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలు శక్తి యాప్‌లోని బటన్‌ను నొక్కితే చాలు, వారి లొకేషన్ వివరాలు వెంటనే కంట్రోల్ రూమ్‌కు చేరుతాయని, నిమిషాల్లోనే పోలీస్ సహాయం అందుతుందని వివరించారు.కేవలం భద్రత మాత్రమే కాకుండా, ఈవ్ టీజింగ్, సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే భయపడకుండా శక్తి యాప్ లేదా డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళా రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ యాప్ ద్వారా ప్రతి మహిళా తన వెంట ఒక పోలీస్ ఉన్నారనే ధైర్యంతో ఉండవచ్చని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.