తొలి శుభోదయం ప్రకాశం:-
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ (Shakti App) డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో డ్వాక్రా మహిళలకు శక్తి యాప్ ఉపయోగకరతపై అవగాహన కల్పించారు. మహిళలు, యువతులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అత్యవసర సమయాల్లో Shakti SOS ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం చేరే విధానాన్ని వివరించారు.అదేవిధంగా ఒంగోలు ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ఒంగోలు హెచ్‌క్యూ టీమ్–1 ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్లోడ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించగా, కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి SOS ఇన్స్టాలేషన్ చేసి మహిళలకు అవగాహన కల్పించారు. అద్దంకి బస్‌స్టాండ్‌లో దర్శి శక్తి టీమ్ ద్వారా ప్రయాణికులు, మహిళలకు శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం చేపట్టారు.ఒంగోలు సబ్‌డివిజన్ పరిధిలో సైబర్ క్రైమ్, మహిళలపై నేరాల నివారణ అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ, శక్తి యాప్ వినియోగం ద్వారా తమ భద్రతను ఎలా కాపాడుకోవచ్చో పోలీస్ అధికారులు వివరించారు. మహిళలు ఎదుర్కొనే ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ మోసాలు వంటి ఘటనలను వెంటనే శక్తి యాప్ ద్వారా లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ… మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ ప్రతి మహిళ మొబైల్లో ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా మహిళలకు ఈ యాప్ గురించి అవగాహన కల్పించాలని కోరారు. ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, గ్రామ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మందికి అవగాహన చేరుతుందని తెలిపారు.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా మహిళల భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్ ప్రచారం నిరంతరం కొనసాగిస్తామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.