తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
ప్రజల ప్రాణ భద్రతే ప్రథమ లక్ష్యంగా, రోడ్డు ప్రమాదాలను సమూలంగా అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో, తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వివిధ శాఖల అధికారులతో కలిసి భారీ సంయుక్త తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), ప్రాంతీయ రవాణా శాఖ (RTO), ఏపీఎస్ ఆర్టీసీ (RTC) మరియు రోడ్లు & భవనాల శాఖ (R&B) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తనిఖీల్లో భాగంగా జాతీయ రహదారిపై అత్యధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాలను (Black Spots) క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి గల సాంకేతిక కారణాలను అధికారులు లోతుగా విశ్లేషించారు. రోడ్డు మలుపుల వద్ద ఉన్న ఇబ్బందులు, స్పీడ్ బ్రేకర్ల శాస్త్రీయ అమరిక, వాహనదారులకు స్పష్టంగా కనిపించే సూచిక బోర్డులు, రాత్రి వేళల్లో తగినంత లైటింగ్ సౌకర్యం మరియు వాహనాల రాకపోకల సరళి వంటి అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్ది, అవసరమైన సవరణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా రోడ్డు ప్రమాదాల వల్ల పోకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, నిరంతరం నిఘా ఉంచుతూ పనిచేస్తాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.