తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో, సింగరాయకొండ సీఐ గారు, టంగుటూరు ఎస్.ఐ మరియు సిబ్బందితో కలిసి టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల్లో తలకు తగిలే గాయాలే మరణాలకు ప్రధాన కారణమని, హెల్మెట్ ప్రాణ రక్షక కవచంలా పనిచేస్తుందని పోలీసులు వివరించారు. అనంతరం వాహనదారులందరిచే “నేటి నుండి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాం” అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ పాల్గొని మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. పోలీసుల ఈ వినూత్న చొరవను ప్రయాణికులు మరియు స్థానికులు అభినందించారు.