సురక్షితంగా, శాంతియుతంగా ఫెస్టివల్ నిర్వహణకు పోలీస్ శాఖ సమగ్ర ప్రణాళిక
తొలి శుభోదయం న్యూస్ :-
సింగరాయకొండ మండల, పాకల బీచ్ వద్ద నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., శనివారం స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్ నిఘా ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన సూచనలు సంబంధిత అధికారులకు తెలియచేస్తున్నారు.ఫెస్టివల్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు రానున్న నేపథ్యంలో బీచ్ ప్రాంతం, ప్రధాన కార్యక్రమ వేదికలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు మరియు పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను కేటాయించటం జరిగింది. ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ ప్రణాళిక రూపొందించి, అవసరమైన చోట్ల వాహనాల దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.సముద్ర స్నానాల భద్రత దృష్ట్యా నియంత్రిత ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లోనే స్నానాలకు అనుమతి ఇస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు తెలియచేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం ప్రత్యేక రెస్క్యూ ఏర్పాట్లు చేశారు.ఫెస్టివల్‌లో నిర్వహిస్తున్న సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక రైడ్స్, వివిధ ఆహార స్టాళ్లు మరియు అలంకరణల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నందున, పోలీసు శాఖ జారీ చేసిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారం, సమన్వయంతో పాకల బీచ్ ఫెస్టివల్‌ను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, తాలూకా సీఐ విజయ కృష్ణ, డీటీసీ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, సింగరాయకొండ ఎస్సై బి.మహేంద్ర, టంగుటూరు ఎస్సై నాగమలేశ్వరరావు, జరుగుమల్లి ఎస్సైబి.మహేంద్ర, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.
