తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లోఆరవ తరగతి చదువుతున్న కనిగిరికి చెందిన సయ్యద్ అలీ కుమారుడు కౌషిత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి ప్రత్యేక విచారణ జరపాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కనిగిరి పట్టణ కార్యదర్శి పీసీ కేశవరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక మరియు సిఐటియు నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలో విద్యార్థి మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, సమాజాన్ని కలచివేసే సంఘటన అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పోలీసులపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక పోలీసు అధికారులతో మాత్రమే కాకుండా, ప్రత్యేక విచారణ నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమించి ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో వాస్తవాలను వెలికితీసి, సాక్ష్యాధారాలు సేకరించి బాలుడి మృతికి కారణమైన వారెవ్వరైనా,ఏ స్థాయి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వినర్ నరేంద్ర వ్యవసాయా కార్మిక సంఘం నాయకులు వెంకటమ్మ మహిళా సంఘం పట్టణ కమిటి సభ్యులు మల్లేశ్వరి నాయకులు చెన్నకేశవులు, దేవదాసు, అడివయ్య, గురవయ్య, ఇమ్మనియల్, చెన్నారెడ్డి, సరస్వతి, సలమ్మా, శైలజ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *