తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయోగి నగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా ఇక్కడ కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవించడం (Open Boozing) వల్ల స్థానిక నివాసితులు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో, సింగరాయకొండ ఎస్ఐ మరియు సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి ఒక ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, బహిరంగ మద్యపానానికి అడ్డాగా మారిన ప్రాంతాలను పోలీసులు స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా అధికారులు స్థానికులతో మాట్లాడుతూ.. కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. పోలీసుల పిలుపుతో స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, తమ పరిసరాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పోలీసుల ఈ చొరవ పట్ల బాలయోగి నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.