తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

అక్షయ తృతీయ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రకాశం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం బుంగబావి సెంటర్‌లోని మండల ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విస్తృత స్థాయి అవగాహనా సదస్సు నిర్వహించబడింది.ఈ అవగాహనా సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదనరావు ముఖ్య అతిథిగా పాల్గొని బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించనున్నారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలియజేశారు.ప్రకాశం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. నాగమణి పాల్గొని బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టపరమైన చర్యలు మరియు అధికారుల బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు.
హై కోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు బాల్య వివాహాల నిరోధక చట్టము 2006 మరియు ఫోక్సో చట్టం 2012 అమలు, కేసుల నమోదు విధానం, మరియు ప్రజలు ఫిర్యాదు చేయాల్సిన విధానంపై వివరించారు.
సార్డ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్. సునీల్ కుమార్ స్వచ్ఛంద సంస్థల పాత్ర, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాల అవసరాన్ని ప్రస్తావించారు.ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ వై. అంజమ్మ అంగన్వాడీ వ్యవస్థ ద్వారా బాలికల రక్షణ, పోషణ, మరియు విద్యపై చేపడుతున్న చర్యలను వివరించారు.సింగరాయకొండ మెడికల్ డిపార్ట్మెంట్ ఆఫిసర్ లావణ్య అధికారులు బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తెలియజేసారు.పోలీస్ శాఖ ప్రతినిధులు బాల్య వివాహాల నివారణలో చట్టపరమైన చర్యలు, ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దినేష్ కుమార్ సభకు అధ్యక్షత వహించి అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో బాల్య వివాహాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు.కార్యక్రమంలో
అంగన్వాడీ సిబ్బంది, గ్రామ స్థాయి కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *