తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో పెట్రోల్ మరియు డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తెలిపారు. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద క్యూ లైన్లలో ప్రజలు నిలబడుతున్నారనే నేపథ్యంలో చీమకుర్తి పట్టణంలోని జియో, హిందుస్థాన్, ఒంగోలులోని మంగమూరు రోడ్ లోని నయారా, భారత పెట్రోలియం తదితర పెట్రోల్ బంక్‌లను జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేశారు. పెట్రోల్, డిజిల్ తమ వాహనంలో నింపుకునేందుకు వచ్చిన వారితో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి పెట్రోల్, డిజిల్ కొరత లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.తనిఖీలలో భాగంగా బంక్‌లలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలపై అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి, పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా కొనసాగించాలని సూచించారు. ఎటువంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే బంకు నిర్వాహకులు ఇంధనాన్ని కేవలం వాహనాలకు మాత్రమే నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు. క్యాన్‌లలో నింపడం వలన బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉందని, అందువల్ల ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్ మార్కెట్ పాల్పడినా, లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, తమ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. భయాందోళనతో అధిక పరిమాణంలో పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంచడం అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చని తెలిపారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద పోలీసు అధికారులు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని, పెట్రోల్ బంక్‌ల వద్ద సిబ్బందిని నియమించటం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, చీమకుర్తి ఎస్సై సంపత్ మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *